Wednesday 21 August 2013

క్లిష్ట పరిస్థితుల్లో భారత్


       
దేశం నేడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది...ఇదేదో సినిమా డైలాగ్ కాదు, నిజంగానే దేశం అనేక రంగాల్లో చాలా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటుందంటున్నారు అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషకులు. దేశానికి ప్రధాన ఇంధనం రూపాయి. ప్రస్తుతం ఇది రోజు రోజుకీ బక్కచిక్కిపోతుంది. ఎంతగా అంటే, ఏ భారతీయ ఆర్థిక శక్తీ రూపాయి విలువను పెంచలేనంతగా సన్నగిల్లిపోతోంది. మన జాతీయ స్థూల ఆదాయం పెరిగిపోతోందని ఒకపక్క పాలకులు భుజాలు ఎగరేస్తున్నా, దేశంలోని అనేక మౌలిక రంగాలన్నీ విదేశీ చేతుల్లో పడి ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతోంది. దీంతో భారతీయ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. ఈ ఆర్థిక బలహీనతల మధ్య భారత్ అనేక విషయాల్లో ప్రమాదకర స్థితిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ పరిస్థితుల్ని చక్కదిద్దుకోకపోయినా, వచ్చే పదేళ్ళలో దేశం మరింత ప్రమాదంలో పడుతుందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో 62 రూపాయలకు పడిపోవడం ఆందోళన కలిగించే విషయం. ఈ దెబ్బతో సెన్సెక్స్ గత నాలుగేళ్లలో ఎప్పుడూ లేనంత కుప్పకూలిపోయింది. రూపాయి విలువ తగ్గడం అనే సంక్షోభం అనేక రంగాలను దెబ్బతీస్తుందని ప్రముఖ ఆర్థిక వేత్త రాజీవ్ బిశ్వాస్ పేర్కొనడం గమనార్హం. దేశ ఆర్థిక వ్యవస్థకు విద్యుత్, పెట్రోలియం, బొగ్గు,సిమెంట్, ఉక్కు, ఎరువులు వంటి రంగాలు మూలస్తంభాల్లాంటివి. కానీ బహుళ జాతీయ సంస్థలు మౌలిక పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టింది చాలా తక్కువ. శీతల పానీయాలు, బిస్కెట్లు, చాక్లెట్లు, పిజ్జాలు, ఐస్ క్రీమ్ లాంటి వినియోగ వస్తువులపైనే ఎక్కువగా పెట్టింది. ఇలాంటి వస్తువులన్నీ విదేశీ కంపెనీ ఉత్పత్తులే. స్థానికంగా విదేశీ కంపెనీలు పెట్టుబడి పెట్టడమంటే, వారికి సంబంధించిన మార్కెట్ వస్తువుల్ని భారత్ లాంటి దేశంలో తయారు చేసుకొని, తిరిగి అధిక ధరకు యిక్కడే అమ్ముకుని సొంతలాభం మాత్రమే చూసుకుంటున్నట్లుగా మారిపోయింది.
                           సరళీకరణ విధానాలు
            విదేశీ పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం నిబంధనలను కూడా సరళీకృతం చేసింది. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు యుపిఎ తలుపులు బార్లా తెరిచింది. అయితే భారతీయ సమాజంలో పేరుకుపోయిన అవినీతి, ప్రభుత్వ విధానాలు ఎప్పుడు ఎలా మారతాయోనన్న భయంతో విదేశీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పెద్దగా ఉత్సాహం చూపడం లేదు. ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రావడం లేదు. గ్యాస్, విద్యుత్ వంటి ఉత్పత్తి, మైనింగ్ రంగాల్లో డాలర్ డామినేట్ చేసే ఆయిల్, బొగ్గు, కంప్యూటర్ లాంటి అత్యవసర వస్తువులపై గత రెండేళ్లుగా 40 శాతం అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. బంగారం, వెండి, పెట్రోలియం దిగుమతులకు సంబంధించిన సుంకాలు తడిసి మోపెడవుతున్నాయి. డాలర్ తో పోలిస్తే ఇపుడు రూపాయి మారకం విలువ 62.45 కు చేరింది. రూపాయి పతనంతో షేర్ మార్కెట్ తీవ్ర పతనావస్థకు చేరడం, విదేశీ పెట్టుబడులు మరింత వెనక్కి పోతున్న కారణంగా భారత్ మార్కెట్ ఆర్థిక పరిస్థితులు మరింత దెబ్బతింటున్నాయి. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం శూన్యం. నగదు ప్రవాహాన్ని తగ్గించేందుకు కొన్ని చర్యలు తీసుకున్నాక కాస్త పుంజుకున్నట్టు కనిపించి రెండు వారాలు కూడా కాకముందే రూపాయి మళ్లీ పతనం వైపు పరుగులు తీస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. 1991లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోవడంతో బంగారాన్ని తనఖా పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ పోలికలేదన్నది ప్రధాని మన్మోహన్ సింగ్ మాట. 1991లో దేశంలో 15 రోజులకు సరిపడా విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉంటే ఇప్పుడు ఆరేడు నెలలకు సరిపడా ఉన్నాయంటూ ఆర్థిక మాంత్రికుడు మన్మోహన్ సింగ్ ఇచ్చే గ్యారంటీలో ఎలాంటి నియంత్రణ సూత్రాలున్నాయో భవిష్యత్తే తేల్చి చెప్పాలి. ఒక పక్క ఆర్థిక వ్యవస్థ కలవరపాటుకి గురిచేస్తుంటే, సింధు రక్షక్ లాంటి వైఫల్యాలు, మన రక్షణ వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అంతర్గత సమస్యలు ఒక ఎత్తయితే, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి సరిహద్దు చొరబాట్లు, భారత్ ను మరింత కృంగదీస్తున్నాయి. అంతేకాక దేశంలోని అనేక రాష్ట్రాల విభజనాంశాలు తలనొప్పిగా మారుతున్నాయి. ఇలా ఒకటా రెండా, అనేక సమస్యలతో దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది.
దిగజారుతున్న దేశ రక్షణ
            నిన్నా మొన్నటి దాకా చైనా, భారత్ నువ్వా నేనా అన్నట్టుగా అన్ని రంగాల్లోనూ ధీటుగా ఉండేవి. కానీ ఇప్పుడు చైనా ఆసియాలోనే తిరుగులేని దిగ్గజంగా ఎదుగుతోంది. పుండుపై కారం చల్లిన విధంగా నిన్నగాక మొన్న సింధు రక్షక్ సబ్ మెరైన్ లాంటి వైఫల్యాలు చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు అందివచ్చిన అవకాశాలుగా మారుతున్నాయి. చైనా, పాకిస్తాన్ కవ్వింపు చర్యలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. వాస్తవానికి నౌకాయాన, వైమానిక రక్షణ కోసం 60 శాతం పరికరాలు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వాటిలో సింధురక్షక్ ఒకటి. భారత సైన్యంలో ఇది అత్యంత కీలకమైనది. సువిశాల సముద్ర తీర ప్రాంతమున్న ఇండియాను కేవలం ఆరు సబ్ మెరైన్లు ఎంత వరకు రక్షించగలుగుతాయి? అనే అనుమానం కలుగకమానదు. చైనాతో పోల్చుకుంటే భారత్ లో 100 షిప్పులు మాత్రమే వున్నాయి. ఆయుధాల ఉత్పత్తిపై స్వయం సమృద్ధి సాధించడంలో వెనుకబాటు, కొనుగోలు విషయంలో అవినీతి ఏజంట్లను భారత్ నిరోధించలేక పోతోంది. ఇటలీతో హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణం ఇందుకు ఉదాహరణ. ఇవిగాక దశాబ్దాల తరబడి కాశ్మీర్ సమస్య భారత్ కు ఓ గుదిబండగా మారింది. ఈ విషయంలో పాక్ తో శతృత్వం కొనసాగుతూనే వున్నది. భారత్ బలహీన క్షణాల కోసం పాక్ ఎదురుచూస్తోంది.
రూపాయి పతనమే ప్రధాన కారణం
          భారత్ దిగుమతుల బిల్లు ప్రతి సంవత్సరం 450 బిలియన్ డాలర్ల పైమాటే. రూపాయి క్షీణించడం వల్ల ఈ బిల్లూ పెరిగే అవకాశం వుంది. దానివల్లే గత రెండు నెలల్లో పెట్రోల్ ధర నాలుగు సార్లు పెరిగింది. ప్రస్తుతం లీటర్ పెట్రోలు 80 రూపాయలు వుంది. రూపాయి విలువ 70 కి చేరితే లీటర్ పెట్రోల్ వంద అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతర్జాతీయంగా బంగారం ధరలు 2.94 శాతం దాకా పడిపోగా, భారత్ లో మాత్రం3.14 శాతం పెరిగాయి. కీలకమైన ఉత్పత్తులు, ముడి సరుకులు దిగుమతి చేసుకోవాల్సిందే. దీని ఫలితంగా వంట నూనెల నుంచి పెట్రోల్ దాకా అన్ని ధరలు భారం అవుతాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు దేశం ఎదుర్కొంటున్న దాదాపు అన్ని సమస్యలకూ రూపాయి పతనమే ప్రధాన కారణమవుతోంది. ఒకపక్క శతృదేశాలు కవ్విస్తున్నాయి, మరోపక్క రూపాయి సంక్షోభం అనేక రంగాలను పట్టిపీడిస్తోంది. అసలు రూపాయి విలువ పడిపోవడానికి మనదేశపు ఆర్థిక విధానాలే ప్రధాన కారణం. దీనికితోడు రాజకీయ నిర్ణయాలు. రూపాయి విలువ పెరగడం, తరగడం అనే విషయం సగటు మానవుడికి అర్థం కాకపోవచ్చు. కానీ ఆ రూపాయే అతడిని ముంచేసే పరిస్థితులు కల్పించకూడదనే కనీస స్పృహ ప్రభుత్వ పెద్దలకుండాలి. అందుకు తగిన ఆర్థిక చర్యలు చేపడితే ఖచ్చితంగా రూపాయి బలపడుతుంది. ఒకప్పటిలాగానే కళకళలాడుతుంది. దేశం సుభిక్షమవుతుంది.  

No comments:

Post a Comment