Friday 10 January 2014

చిటికెలో పాదాల అందం మీ సొంతం

అందం విషయంలో మొదట జుట్టును కాపాడుకోవడానికి తలకు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, హెయిర్ ప్యాక్స్, హెయిర్ స్పా, హెయిర్ మసాజ్, నూనెలు రాస్తుంటాం. అదే శరీర సంరక్షణకు బాడీలోషన్, సోపులు, సన్ స్క్రీన్ లోషన్ రాసి, శరీరాన్ని కాలుష్యం, ఎండ నుండి రక్షించుకుంటుంటాం. అదే విధంగా ముఖం అందంగా కనబడాలని, ఫేస్ ప్యాక్, ఫేస్ క్రీములు, వాడుతుంటాం. అలాగే శరీరానికి చెమట వల్ల దుర్వాసన రాకుండా లోపల డియోడ్రెంట్‌, బయట సెంటు కొట్టుకుంటాం. కానీ మనల్ని రోజంతామోసే పాదాల గురించి మనం పట్టించుకున్నామా? పాదాల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిందే. పాదాలు చేసే సేవకు ప్రత్యుపకారంగా గాని, లేదా మరికొంత ఎక్కువ కాలం ఆ విలువైన సేవను కొనసాగించడానికి గాని పాదాల కోసం మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అవేంటో ఒక సారి చూద్దాం.... చిటికెలో పాదాల సొగసు మీ సొంతం... 
 
 1. స్నానల గదిలో: రకరకాల వాసన సబ్బులతో స్నానమైతే చేస్తాం. కానీ స్నానపు ఘట్టంలో చాలా మంది పాదాల జోలికే పోరు. రెండు నిమిషాలు అదనంగా పాదాల కోసం కేటాయించి పాదాలను రుద్దుకుంటే అరికాలిలో ఉన్న మట్టి, మృకణజాలం పోయి పాదం మృదువుగా, అందంగా తయారవుతుంది. పాదం శుభ్రం చేసుకోవడానికి ఓ ప్రత్యేకమైన రాయి కూడా ఫ్యాన్సీ షాపుల్లో రూ.10 నుంచి రూ.50 రూపాయల్లోపు అందుబాటులో ఉంది. ఈ రాయి వడ్రంగులు వాడే ఆకురాయిలాగా ఉంటుంది. పాదానికి ప్రమాదం ఉండదు. మెరుగైన శుభ్రత ఉంటుంది. పాదాల వేళ్ల మధ్యలో కూడా శుభ్రం చేయడం మరవకూడదు. ఇలా చేస్తే పాదం శుభ్రపడటమే కాకుండా మడిమ పగుళ్లు, ఆనెలు రాకుండా, వచ్చినా త్వరగా నయం కావడానికి ఎంతో సహకరిస్తుంది. 
2. పడుకునే ముందు: రాత్రిపడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు ఉన్న మట్టి, సూక్ష్మజీవులుపోయి కాలు శుభ్రపడి పాదాలకు వచ్చే ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేసుకోవచ్చు. అయితే వేళ్లమధ్యలో ఉన్న తేమను గుడ్డతో తుడుచుకుని, తడి ఆరిన తరువాతే పడుకోవాలి. అలాకాని పక్షంలో వేళ్ల మధ్యలో ఫంగస్‌, అంటువ్యాధులు సోకే అవకాశముంది. 
3. కత్తిరించుకోవాలి: క్రమం తప్పకుండా కాలిగోళ్లను కత్తిరించుకోవాలి. గోళ్లను ఏమాత్రం పెరగనివ్వకూడదు. తప్పనిసరిగా నెయిల్‌ కట్టర్‌నే వాడాలి. మూలలు కత్తిరిస్తే భవిష్యత్‌లో గోరులోనికి పెరిగి ‘ఇన్‌ గ్రోయింగ్‌ నేయిల్‌' అనే జబ్బు వస్తుంది. 
4. ఇంట్లో కూడా చెప్పులు: బయటే కాక ఇంట్లో ఉన్నప్పుడూ చెప్పులేసుకోవడం తప్పనిసరి. ఇంటిలోపల, ఇంటి వెలుపలికి వేరు వేరు చెప్పులు వాడటం మంచి ఆరోగ్య సూత్రం. ఆనెలను కోయకూడదు కాలి డెడ్స్ స్కిన్ కోయకూడదు. కొద్ది మందికి కాళ్లలో డెడ్ స్కిన్ వస్తాయి. వీటిని బ్లేడుతో కోయకూడదు. రాయితో పాదాలను రుద్దితే ఆనెలు కూడా క్రమంగా తగ్గుతాయి. 
5. చెప్పులను సాయంత్రమే కొనాలి: పాదరక్షలను సాయంత్రం సమయంలోనే కొనాలి. ఉదయం కంటే సాయంత్రం పాదాలు కొద్దిగా పెద్దవిగా ఉంటాయి. ఉదయంపూట సరైన సైజుతో కొన్న చెప్పులు, బూట్లు సాయంత్రానికి బిగుసుకుని పాదాలపై ఒత్తిడి కలిగే అవకాశముంది. ఈ ఒత్తిడే పుండుపడటానికి దారితీస్తుంది. 
6. బూట్లకు సెలవు మనం వాడే బూట్లకు రోజు మార్చి రోజు సెలవు ఇవ్వాలి. అంటే ఒకరోజు వాడి రెండో రోజు వాడకపోవడం. బూటులోపల తడి ఆరడానికి ఈ సెలవు పనిచేస్తుంది. తడిఆరని బూట్లు, సాక్సుల వల్ల పాదానికి ఫంగల్‌ అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. రోజూ సాక్స్‌ను మార్చాలి. ఒకేసాక్సు ఎక్కువ రోజులు వాడకూడదు. 
7. అరగంట నడక రోజూ కనీసం అరగంట నడవాలి. నడక కాలికి మంచిది. రక్తప్రసరణ పెంచుతుంది. తద్వారా అనేక రకాల పాదాల వ్యాధులను నివారించొచ్చు. 
8. పొగమానాలి ధూమపానం వల్ల రక్తనాళాల్లో రక్తప్రసరణ తగ్గుతుంది. ప్రత్యేకంగా గుండె, పాదాల్లో ఈసమస్య ఎక్కువగా ఉంటోంది. కొన్ని పరిస్థితుల్లోకాలుతీసేయాల్సి వస్తుంది. ఈ జాగ్రత్తలు సాధారణ వ్యక్తులతో పాటు, మధుమేహగ్రస్తులు కూడా తప్పక అనుసరించాలి.

No comments:

Post a Comment