Monday 27 January 2014

నలుగురూ కోరుకునే నవ్వుల తెల్లదనం

తీపి, పిండి పదార్థాలు పళ్ళ మీద పేరుకుపోవడం వల్ల పళ్ళు పాడవుతాయన్నది ఇప్పటివరకూ ఉన్న నమ్మకం. నోటిలో ఉండే బ్యాక్టీరియా,
నోట్లో పేరుకుపోయిన ఆహార పదార్థాల మీద వృద్ధి చెంది, యాసిడ్లు తయారై, పంటి మీద ఎనామిల్‌ను దెబ్బతీసి, పళ్ళు పాడవడానికి కారణమవుతాయనే అభిప్రాయం ఉండేది. కానీ డాక్టర్‌ 'వెస్టామ్‌ ప్రైసెస్‌', ఇతర దంత వైద్యులు ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు చేసి, అనేక విషయాలు కనిపెట్టారు.
దంత వైద్యుల తాజా పరిశోధన వల్ల తేలిందేంటంటే, అసలు సరిగా బ్రష్‌ చేసుకోనివారు, పళ్ళ మధ్య ఇరుక్కుని పోయిన ఆహారపదార్థాల్ని శుభ్రం చేసుకోని వారిలో చాలామందికి పళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయి. ఎటువంటి పిప్పి పళ్ళూ లేవు. అయితే డాక్టర్‌ వెస్టామ్‌, ఇతర దంత వైద్యులు పళ్ళ అనారోగ్యానికి ఈ సరికొత్త కారణాలను తెలుపుతున్నారు.
తీసుకునే ఆహారంలో తగు పాళ్ళలో మినరల్స్‌ లేకపోవడం.
ఎ, డి, ఇ, కె, వంటి విటమిన్లు లేకపోవడం.
పేగు వ్యవస్థ సరిగా పోషకాలను గ్రహించుకోలేక పోవడం.
తీసుకునే గింజ ధాన్యాలు, నట్స్‌, బఠాణీ వంటి ఫైటిక్‌ యాసిడ్‌ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకపోవడం.
సమయం గడిచే కొద్దీ క్యాల్షియం, పొటాషియం నిష్పత్తిలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల ఎముకలలో ఉండే మినరల్స్‌ తగ్గిపోయి పళ్ళు పాడవుతాయి.
శరీరాన్ని నియంత్రణలో ఉంచడానికి, పళ్ళను మినరల్స్‌ అంటిపెట్టుకుని ఉండటానికి చేయవలసిందల్లా మనం తినే ఆహారంలో విటమిన్లు, మినరల్స్‌ ఎక్కువ స్థాయిలో ఉండేలాచూసుకోవడమే. ఇలా చేయడం వల్ల దృఢమైన పళ్ళ నిర్మాణం సొంతమవుతుంది.
ఏయే పదార్థాలు తినాలి?
కొబ్బరినూనె, వెన్న, సేంద్రియ మాంసం, సముద్రపు ఆహారం.
సేందియ కూరగాయలు.
లివర్‌ లాంటివి తీసుకోవాలి.
తినకూడనివి!
పిండి పదార్థాలు, పంచదారలతో తయారు చేసిన ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తినడం తగ్గించాలి. అందువల్ల బ్లడ్‌ సుగర్‌ నియంత్రణలోకి వస్తుంది. సుగర్‌ను నియంత్రణలో పెట్టుకోవడం వల్ల కూడా పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
డాక్టర్‌ సలహాతో అదనపు పోషకాలు
కాడ్‌లివర్‌ ఆయిల్‌: ఎ, డి, కె విటమిన్లు పెద్ద స్థాయిలో ఉంటాయి.
మెగ్నీషియం: క్యాల్షియం, ఫాస్ఫరస్‌ను ప్రతిభావంతంగా ఉపయోగించుకోవడానికి వీలుపడుతుంది.
జిలాటిన్‌: ఇది పళ్ళ గట్టిదనానికి, చిగుళ్ళు బలంగా ఉండడానికీ పని చేస్తుంది.
పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?
పీచు పదార్థం ఎక్కువ ఉన్న పదార్థాలు తినాలి. యాపిల్‌, క్యారెట్ల లాంటి ఆహారం తింటే చిగుళ్ళకు మసాజ్‌ జరిగి రక్త ప్రసరణ బావుంటుంది. నోటిలో యాంటీ మైక్రోబియల్స్‌తో కూడిన లాలాజలం ఊరి, బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఆరెంజ్‌, ద్రాక్ష వంటి పండ్లు కూడా మంచివే. వాటిలో ఉండే 'సి' విటమిన్‌ చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.
పళ్ళలోని బ్యాక్టీరియాను పెరుగు హరించి వేస్తుంది. పళ్ళ మధ్య ఇరుక్కున్న వ్యర్థాలను తీసి వేస్తుంది.
గ్రీన్‌ టీలో ఉండే కేటెచిన్‌ అనే పదార్థం, పళ్ళపైన పొర ఏర్పడ కుండా చేసి, నోటి దుర్వాసనను పోగొడుతుంది.
ఛీజ్‌లో ఎక్కువ శాతం డి విటమిన్‌ ఉంటుంది. ఇది పళ్ళ మీద ఎనామిల్‌ను పోకుండా కాపాడుతుంది. ఇంకా కొత్త ఎనామిల్‌ ఏర్పడటానికి కారణం అవుతుంది. ఇది నోటిలోని పీహెచ్‌ను నియంత్రించి, పళ్ళను పాడు చేసే బ్యాక్టీరియా నుండి కాపాడుతుంది. రోజూ భోజనం తర్వాత ఒక ముక్క ఛీజ్‌ తింటే మంచిది.
సలాడ్లలో పచ్చి ఉల్లిపాయలు తింటే, అందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ కాంపౌండ్స్‌ నోటిలోని బ్యాక్టీరియాను చంపుతాయి. కానీ ఉల్లిపాయలు తిన్న తర్వాత కొన్ని పుదీనా ఆకులు నమలడం మరచిపోవద్దు.
పళ్ళు తెల్లగా ఉండాలంటే నిమ్మరసం ఒక చక్కని ఉపాయం. అలాగే ఆరెంజ్‌ పైన తొక్కలతో పళ్ళపై రుద్దుతుంటే కూడా పళ్ళు మిలమిలా మెరుస్తాయి.
పుదీనా ఆకులు నమిలితే శ్వాస తాజాగా ఉంటుంది.అందులో ఉండే మాంటెర్పీన్స్‌ రక్త ప్రవాహం నుండి శ్వాసలోకి చేరతాయి. పుదీనా ఎప్పుడూ వెంట ఉంచుకోవడం మంచిది.
నువ్వులు పళ్ళ మీద పేరుకున్న వ్యర్థాల పొరను శుభ్రం చేస్తాయి. ఎనామిల్‌ను ఏర్పరుస్తాయి. అందులో అధిక స్థాయిలో ఉండే క్యాల్షియం చిగుళ్ల చుట్టూ ఉన్న ఎముకలను గట్టిపరుస్తుంది.
నీరు ఎక్కువగా తాగడం వల్ల నోట్లో లాలాజలం ఊరి, చిగుళ్ళు తడిగా ఉండేలా చూస్తుంది. నోటిలో వ్యర్థాలు పేరుకోకుండా, పిప్పి పళ్ళు రాకుండా చూస్తుంది. ప్రతి భోజనం తర్వాత బ్రష్‌ చేసుకోవాలి. అలా చేయలేని పక్షంలో నీరు తాగడం మాత్రం మరచిపోకూడదు.

No comments:

Post a Comment