Monday 3 February 2014

ముఖ్యమైన పత్రాలను భద్రపరుచుకోవడం ఎలా...

పాప స్కూల్‌ అడ్మిషన్‌ కోసం వెళ్ళాలి. ఈ జనన పత్రం ఏమో కనిపించడం లేదు. ఎలా ఇప్పుడు... అని ఒక్కటే హైరానా పడిపోతున్నాడు రవి. అప్పటికే అన్ని పత్రాలను వెతికి వెతికి అలసిపోయి ఎక్కడ పెట్టానా? అని ఒక్కటే
ఆలోచిస్తున్నాడు. అయినా గుర్తురావడం లేదు. ఇలా కాదని ఆదివారం రోజు అన్ని పత్రాలను ముందేసుకొని కూర్చున్నాడు. దొరికే వరకూ వెతుకుతూనే ఉన్నాడు. చివరికి దొరికింది.
ఈ టెన్షన్‌ తప్పాలంటే ముఖ్యమైన పత్రాలను ముందుగా వేటికవి విడదీసి, ఒకదగ్గర పెట్టుకోవాలి. ఉదాహరణకు బ్యాంకుకు, ఇన్స్యూరెన్స్‌కు, లోన్‌లకు సంబంధించినవి, ఐడెంటిటి కార్డులు.... ఇలా వేరుచేసుకొని, భద్రపరుచుకున్న వాటిని ఇంట్లో మీ ఒక్కరికే కాక, వేరొకరికీ చెప్పి ఉంచాలి. ఇలా చేస్తే అవసరమైనప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకే వీటిని ఎలా విభజించుకోవాలంటే...
ప్రాథమిక పత్రాలు: వీటిలో జనన పత్రాలు, మ్యారేజ్‌ సర్టిఫికేట్‌, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు, ఎలక్షన్‌ ఐడికార్డు, ఆధార్‌ కార్డు, గ్యాస్‌ బుక్‌... ఇవి ఎప్పుడూ అవసరమయ్యేవి. అందుకే ఇవి ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. బండి లైసెన్స్‌ కూడా ఐడి కార్డుగా ఉపయోగపడుతుంది. దీని డూప్లికేట్‌ను దగ్గర పెట్టుకొని, ఒరిజినల్‌ను ఇంట్లోనే భద్రపరుచుకోవాలి.
ఇన్సూరెన్స్‌ విషయాలు: జీవిత బీమాలు, ఆరోగ్య బీమాలు, పిల్లలకు, పెద్దవారికి సంబంధించిన పాలసీలు ఇలా వేటికవి, విడదీసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు కట్టిన బిల్లులనూ జాగ్రత్త చేసుకొని, వాటితో పాటే భద్రపరుచుకోవాలి. బీమాలు ఎవరి పేరుతో ఉన్నాయి? ఎంత మొత్తం ఉన్నాయి? నామీలు ఎవరు? అనే విషయాలను కూడా ఒక డైరీలో రాసి, వాటితో పాటు ఉంచితే వెంటనే చూసుకోవడానికి వీలుగా ఉంటాయి. బీమా విషయాలకు సంబంధించిన పత్రాలన్నింటినీ ఒకే దగ్గర ఉంచుకోవడం ఉత్తమం.
పెన్షన్‌ పత్రాలు: మీకు కనుక పెన్షన్‌ ఎకౌంట్‌ ఉంటే వాటికి సంబంధించిన పత్రాలను ఒక దగ్గర ఉంచాలి. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఎకౌంట్‌ వివరాలకు సంబంధించిన పత్రాన్ని కూడా జాగ్రత్త చేసుకోవాలి. నామినీ విషయాన్ని కూడా రాసి పెట్టుకోవాలి.
ఆస్తులకు సంబంధించినవి: ఆస్తులకు సంబంధించిన పత్రాలన్నింటినీ ఒకే దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ మీ ఆస్తులేమైనా తాకట్టులో ఉంటే ఆ ఆస్తి పత్రాలనూ జిరాక్స్‌ తీసి, భద్రపరుచుకోవాలి. వాటికి సంబంధించిన లోన్‌ ఎకౌంట్‌ నెంబర్‌... ఎప్పటికప్పుడు ఎంత కట్టింది... ఇంకా ఎంత కట్టాలి.. లాంటి వివరాలను కూడా క్రమం తప్పకుండా రాసుకుంటే వివరంగా ఉంటాయి. ఆస్తులకు కనుక ఇన్స్యూరెన్స్‌ ఉంటే వాటికి సంబంధించినవీ ఇక్కడే ఉంచుకోవాలి.
బ్యాంక్‌ ఎకౌంట్‌ వివరాలు: ఆఫీసుకు సంబంధించిన ఎకౌంట్‌, వ్యక్తిగత ఎకౌంట్లు ఇవన్నీ కొందరికి వేర్వేరు బ్యాంకులలో ఉంటాయి. వాటి ఎకౌంట్‌ నెంబర్లు, ఎంత నిల్వ ఉన్నదీ, నామినీల పేర్లు.... ఇలా విడివిడిగా రాసి పెట్టుకోవాలి. వాటితో పాటు ఎకౌంట్‌ బుక్స్‌, వాటి ఎటిఎమ్‌ల పాస్‌వర్డ్‌ పత్రాలు జాగ్రత్తగా దాచుకోవాలి. మీరు ఎప్పుడైనా పాస్‌వర్డ్‌ మరిచిపోయినా వీటిని చూసుకోవచ్చు.
బ్యాంక్‌ లాకర్‌ విషయాలు: బ్యాంక్‌ లాకర్‌ ఏ బ్యాంక్‌లో ఉందనే విషయాన్ని, లాకర్‌ నెంబర్‌, యాజమాన్య వివరాలు, లాక్‌ వివరాలు... అన్నీ ఒక దగ్గర రాసి, భద్రపరుచుకోవాలి. లాకర్‌లో ఏమున్నాయో, ఎప్పుడెప్పుడు లాకర్‌ను తెరిచారో వంటి వివరాలు ఎప్పటికప్పుడు రాసుకోవాలి.
ఇతర పెట్టుబడులు: పిపిఎఫ్‌ ఎకౌంట్‌, పోస్టాఫీస్‌ ఎకౌంట్‌, ఆర్‌డిలు, ఫిక్సిడ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్‌ వివరాలు, స్టాక్‌ మార్కెట్‌ ఎకౌంట్‌లకు సంబంధించిన వివరాలు, ఈ ఎకౌంట్‌లలో నామినీల వివరాలన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి. వ్యక్తిగత ప్రైవేట్‌ లోన్‌ వివరాలు డాక్టర్‌ చెకప్‌లకు సంబంధించినవి, వస్తువుల వారెంటీలకు సంబంధించినవి విడివిడిగా భద్రపరుచుకోవడం ఉత్తమం. అలాగే పాత డాక్యుమెంట్స్‌ను కూడా.

No comments:

Post a Comment